top of page

మెగాస్టార్ చిరంజీవి
సంక్షిప్త ప్రొఫైల్

డాక్టర్ చిరంజీవి తన నటజీవితాన్ని పునాదిరాళ్లతో ప్రారంభించారు. కానీ 1977లో ప్రాణం ఖరీదు మొదటిసారిగా విడుదలైంది. చిరంజీవి హిందీలో 3, తమిళంలో 3, కన్నడలో 2 సహా 151 కి పైగా చిత్రాలలో నటించారు

చిరంజీవి తన అద్భుతమైన నటన, హీరోయిజం, డాన్స్‌పై పట్టు, కామెడీ టైమింగ్‌తో పాటు వీటన్నింటికంటే వృత్తిపట్ల అంకితభావం కలిసి స్టార్‌గా గుర్తింపు తెచ్చిపెట్టాయి. 

 

ఒక వైపు శుభలేఖ, స్వయం కృషి, రుద్రవీణ, ఆపద్భాంధవుడు, ఠాగూర్ వంటి సామాజిక స్పృహ కలిగిన సినిమాలలో నటిస్తూ విమర్శకులు, క్లాస్ ఆడియన్స్ ప్రశంసలు పొందారు. మరోవైపు చంటబ్బాయ్, ఖైదీ, జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరనా మొగుడు, ముఠా మేస్త్రి, హిట్లర్, మాస్టర్, ఇంద్ర, శంకరదాదా వంటి పలు సినిమాలలో నటించడం ద్వారా మాస్‌ ప్రేక్షకుల ఆదరణను సొంతం చేుసుకున్నారు.

ప్రయాణం

డా. చిరంజీవికి తన అసమాన నటనా కౌశలంతో భాష, ప్రాంత సరిహద్దులను చెరిపివేశారు. అన్ని వయసుల అభిమానులను ఆదరణను సొంతం చేసుకున్నారు. తెలుగు ప్రజలు చిరంజీవిని ప్రేమ, ఆప్యాయతతో మెగాస్టార్‌ అని కూడా పిలుచుకుంటారు.


నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న కెరీర్లో, చిరంజీవి 'మ్యాన్ ఆఫ్ ది మాస్' గా గుర్తింపు పొందారు. 'టాప్ 50 పవర్ పీపుల్ ఆఫ్ 2. ఇండియా జాబితాలో చోటుకూడా సంపాదించుకున్నారు.

డా. చిరంజీవి తనకున్న అసంఖ్యాకమైన అభిమానులను సమాజసేవ వైపు నడిపించాలని నిర్ణయించారు.  ఇందుకోసం చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌(1998లో) స్థాపించి రక్తదానం, నేత్రదానం చేయించాలని నిర్ణయించారు. రక్తదానంలో చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌ చేస్తున్న సేవలు పలు ప్రశంసలు అందుకుంది. అంతేకాకుంబా బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా విస్తృత ప్రచారం నిర్వహించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఆక్సిజన్‌ బ్యాంక్‌ స్థాపించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 32 కేంద్రాల్లో ఆక్సిజన్‌ బ్యాంకులు ఏర్పాటు చేశారు. 

అవార్డులు మరియు గుర్తింపులు:

 

స్వయంకృషి (1987), ఆపద్భాంధువుడు (1992), ఇంద్ర (2002) సినిమాలకు మూడు నంది అవార్డులు గెలుచుకున్నారు.

1988లో సొంతగా నిర్మించిన రుద్రవీణ సినిమా జాతీయ సమైక్యత విభాగంలో నర్గీస్‌ దత్‌ అవార్డు దక్కించుకుంది.

 

ఉత్తమ నటుడుగా ఏడు ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఒకే విభాగంలో అత్యధిక అవార్డులు అందుకున్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

 

ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలుచుకున్న సినిమాలు:

  • పున్నమి నాగు- 1980

  • శుభలేఖ- 1982

  • రుద్రవీణ- 1988

  • ముఠా మేస్త్రి- 1993

  • స్నేహం కోసం- 1999

  • ఇంద్ర- 2002

  • శంకర్ దాదా M.B.B.S

  • లెజండ్‌ హార్మనీ అవార్డ్‌ - 2006

  • అవుట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ అవార్ద్‌ - 2010

​నంది అవార్డ్స్ అవార్డు గెలుచుకున్న సినిమాలు:

  • స్వయంకృషి- 1987

  • ఆపద్బాంధవుడు- 1992

  • ఇంద్ర- 2002

  • గౌరవ పురస్కారం (రఘుపతి వెంకయ్య అవార్డు)- 2016    

 

వంశీ అకాడ‌మీ సంస్థ డా. చిరంజీవికి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఎన్టీఆర్ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్ అవార్డును బ‌హూక‌రించింది. 

భార‌త దేశంలో మూడవ అత్యున్న‌త పుర‌స్కార‌మైన పద్మ భూషణ్‌ అవార్డును చిరంజీవి 2007లో అందుకున్నారు.
 

అదే సంవత్సరంలో చిరంజీవికి ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.

 

ఇవే కాకుండా, వంశీ-బర్కిలీ, కళాసాగర్ చెన్నై, సంతోషం ఫిల్మ్ మ్యాగజైన్, సితార ఫిల్మ్ మ్యాగజైన్, స్క్రీన్‌ వీడియోకాన్ అవార్డ్స్, రోటరీ క్లబ్, అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ తిరుపతి వంటి లెక్కలేనన్ని సాంస్కృతిక సంస్థల నుండి ఎన్నో అవార్డులు,  ప్రశంసలు అందుకున్నారు.

chirufeli24_edited.jpg

సామాజిక పని రంగంలో విజయాలు:

 

  • చిరంజీవి 30 సంవత్సరాల సినీ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్ళ‌ను దాటారు. త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో కోట్లాదిమంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నారు. త‌న న‌ట‌నతో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన వ్య‌క్తిగా స‌మాజంలో గుర్తింపును తెచ్చుకున్నారు. త‌నంటే ప్రాణ‌మిచ్చే అభిమానులు ఉన్నార‌ని చిరంజీవి పొంగిపోలేదు. త‌నను అభిమానించే కోట్లాది మంది అభిమానుల ద్వారా స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే కార్య‌క్ర‌మాల‌ను చేయించాల‌ని భావించారు.
     

  • త‌న అసంఖ్యాక అభిమానులే ఆస‌రాగా 1998 అక్టోబ‌రు 2వ తేదీన చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్‌ను ప్రారంభించారు. ఈ ట్ర‌స్ట్ ద్వారా ర‌క్త‌, నేత్ర‌దానానికి బీజం వేశారు. చిరంజీవి మొద‌లు పెట్టిన ఈ సేవా కార్య‌క్ర‌మానికి అభిమానులు, ప్ర‌జ‌ల‌నుంచి అనూహ్య స్పంద‌న ల‌భించింది. అచిర కాలంలోనే చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌లకు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. అప్ర‌తిహ‌తంగా ప్ర‌జ‌ల మనన్నలు పొందిన వీటి వెనుక చిరంజీవి మ‌హా యజ్ఞాన్నే చేశారు. ఇప్ప‌టికీ చేస్తూనే ఉన్నారు.
     

  • బ్లడ్ బ్యాంకు ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు 57వేల యూనిట్ల ర‌క్తాన్ని అందించారు.  వీరిలో ఎక్కువ‌గా నిరేపేద‌లైన పేద‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. అంతే కాకుండా స‌కాలంలో ప్రాణాధారమైన ర‌క్తాన్ని అందించ‌డం ద్వారా 3,500 మంది ప్రాణాల‌ను కాపాడగలిగారు. 

  • వైద్యుల అంచాన ప్ర‌కారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏటా 5 ల‌క్ష‌ల యూనిట్ల ర‌క్తం అవ‌స‌ర‌మ‌వుతుంది. అయితే చిరంజీవి రక్త‌దానంపై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ద్వారా మ‌న రాష్ట్రాల్లోనే మూడున్న‌ర ల‌క్ష‌ల యూనిట్ల ర‌క్తం దానం చేసేలా ప్రోత్స‌హించారు. ఇది అరుదైన ఘ‌నత.
     

  • చిరంజీవి మ‌రో మాన‌స‌పుత్రిక అయిన ఐ బ్యాంకు కూడా ఎంతోమందికి చూపును ప్ర‌సాదించింది. ఇప్ప‌టి వ‌ర‌కు 1460 ఇంప్లాంట్‌లను అందించి వారందిరికీ కంటిచూపును తెప్పించ‌డంలో కీల‌క పాత్ర పోషించింది. ఇప్ప‌టికీ చిరంజీవి అభిమానులు నేత్ర‌దానం గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ వారిలో అవ‌గాహ‌న పెంచేందుకు కృషి చేస్తూనే ఉన్నారు.

  • ఒక‌వైపు చిరంజీవి అభిమానులు ర‌క్త దానం, నేత్ర దానం గురించి ప్ర‌చారం చేస్తుంటే, మ‌రో వైపు త‌న ప్ర‌తి సినిమాలో సినిమా ప్రారంభానికి ముందు ర‌క్తదానం, నేత్ర‌దానం గురించి చిరంజీవి స్వ‌యంగా వివ‌రిస్తారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌జ‌ల్లో కొంతైనా అవ‌గాహ‌న క‌లుగుతుంద‌ని చిరంజీవి భావిస్తారు. 
     

  • త‌న సినిమా సిల్వ‌ర్ జూబ్లీ ఆడింద‌నే వార్త‌కంటే.. బ్ల‌డ్ బ్యాంక్ ద్వారా ఒక వ్య‌క్తి ప్రాణం నిల‌బెట్ట‌గ‌లిగామ‌నే వార్తే వింటే ఎక్కువ గ‌ర్వంగా ఉంటుంద‌ని చిరంజీవి చెబుతారు.

 

  • చిరంజీవి సినిమాలు గ‌మ‌నిస్తే కేవ‌లం డ్రామా, గ్లామ‌ర్ పాత్ర‌లే కాదు త‌ర‌చు సామాజిక స్పృహ క‌లిగిన పాత్ర‌లు కూడా చేస్తుంటారు. కేవలం సినిమాల‌లో న‌టించ‌డ‌మే కాదు స‌మాజంప‌ట్ల బాధ్య‌త క‌లిగిన పౌరుడిగా అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు సైతం నిర్వ‌హించారు. చిరంజీవికి దేనిపైనైనా ఒక‌సారి న‌మ్మ‌కం క‌లిగినా, ఏదైనా సామాజిక కార్య‌క్ర‌మానికి ప్ర‌చారం చేయ‌డానికి అంగీక‌రించినా... వాటితో జివితాంతం ప్ర‌యాణం సాగిస్తారు. 
     

  • ఈ క్ర‌మంలోనే చిరంజీవి ఇంట‌ర్నేష‌న‌ల్ లేబ‌ర్ ఆర్గ‌నైజేష‌న్ (ILO)కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మితుల‌య్యారు. దానిని ఒక అలంకార ప్రాయంగా భావించ‌లేదు.. బాధ్య‌త‌గా చేప‌ట్టారు. బాల కార్మిక వ్య‌వ‌స్థ‌కు వ్య‌తిరేకంగా విస్తృత ప్ర‌చారం నిర్వ‌హించారు. బాల కార్మిక వ్య‌వ‌స్థ‌కు వ్య‌తిరేకంగా అంత‌ర్జాతీయ స్థాయిలో నిర్మించిన షార్ట్ ఫిల్మ్‌లో కూడా న‌టించారు. 
     

  • ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు రిచర్డ్ గేర్ నేతృత్వంలో రూపొంది, హీరోస్ ప్రాజెక్టులో సైతం చిరంజీవి పాలుపంచుకున్నారు. ప్ర‌పంచంలోని వివిధ ప్రాంతాల్లో హెచ్ఐవి, ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించడం కోసం ఈ ప్రాజెక్ట్ పనిచేస్తుంది.
     

  • అత్య‌త్త‌మ సేవ‌లు అందిస్తున్నందుకు గాను చిరంజీవి బ్లండ్ బ్యాక్ ఆరుసార్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అందించే అత్యుత్త‌మ అవార్దుకు ఎంపికైంది. 2002, 2003, 2004, 2005, 2006 సంవత్సరాలలో ‘బెస్ట్ వాలంటరీ బ్లడ్ బ్యాంక్ సర్వీస్ అవార్డు`ను కైవ‌సం కేసుకుంది. 161 బ్ల‌డ్ బ్యాంక్‌లు పోటీ ప‌డ‌గా చిరంజీవి బ్ల‌డ్ బ్యాంకు మాత్ర‌మే ఇన్నిసార్లు అవార్డు గెలుచుకోవ‌డం విశేషం.
     

  • దేశంలో ఎక్క‌డ ఏ విప‌త్తు సంభ‌వించినా ఆదుకోవ‌డానికి చిరంజీవి ముందుంటారు. త‌మిళ‌నాడులో సునామీ వచ్చినప్పుడు అప్ప‌టి ప్ర‌భుత్వానికి విరాళాలు సేక‌రించి ఇచ్చారు. అదే స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నీడ‌ను కోల్పోయిన వారిని ఆదుకోవ‌డం కోసం అప్ప‌టి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిగారికి సైతం విరాళం అంద‌జేశారు.
     

  • నారా చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో రెండు సార్లు ప్ర‌కృతి విప‌త్తులు సంభ‌వించాయి. అప్పుడుకూడా చిరంజీవి ముందుకు వ‌చ్చి ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి విరాళం ఇచ్చారు. 
     

  • గౌరవనీయులైన మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం పిలుపుతో స్ఫూర్తి పొందిన డాక్టర్ చిరంజీవి హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన లీడ్ ఇండియా 2020 ఫౌండేషన్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.
     

  • అంత‌ర్జాతీయ సంస్థ యునెసెఫ్ సైతం చిరంజీవిని త‌మ కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌చార క‌ర్త‌గా ఉండాల‌ని కోరింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌నుండి పోలీయోను పార‌ద్రోలేందుకు యెనెసెఫ్ నిర్వ‌హించిన ప్ర‌చార కార్య‌క్ర‌మంలో చిరంజీవి పాలుపంచుకున్నారు. చిన్నారుల‌ను పోలియోనుంచి ర‌క్షించ‌డానికి ఈ కార్య‌క్ర‌మం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డింది.
     

  • నేత్ర‌దానంపై అవ‌గాహ‌న కల్పించే కార్య‌క్ర‌మాల‌లో సైతం చిరంజీవి ముందుంటారు. ఈ క్ర‌మంలోనే స‌రోజినీ దేవి కంటి ఆసుప‌త్రి ప్ర‌పంచ నేత్ర‌దినోత్స‌వం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో చిరంజీవి పాల్గొన్నారు. అప్ప‌టి గ‌వ‌ర్న‌ర్ రంగ‌రాజ‌న్‌తో క‌ల‌సి ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు
     

  • తాను స్వ‌యంగా సేవా కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన‌డ‌మే కాదు. త‌న అభిమానులు సైతం ఇలాంటి కార్య‌క్ర‌మంలో పాల్గొనే ప్రోత్స‌హిస్తారు. లాతూర్‌లో భూకంపం సంభ‌వించిన‌ప్పుడు త‌న అభిమానులు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌వ‌ల‌సిందిగా పిలుపునిచ్చారు. త‌న అభిమాన నాయ‌కుడు స్వ‌యంగా కోర‌డంతో ల‌క్ష‌లాది మంది అభిమానులు భూకంప బాధితుల‌కోసం ఆహారం, దుస్తులు సేక‌రించి బాధితుల‌ను ఆదుకోవ‌డంలో ముందున్నారు. 
     

  • పాకిస్థాన్ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన పాకిస్థాన్ అమ్మాయి గుండె ఆప‌రేష‌న్‌కు చిరంజీవి స‌హ‌కారం అందించారు. గ్లోబ‌ల్ ఆసుప‌త్రిలో చికిత్స అనంత‌రం జ‌రిగిన వీడ్కోలు కార్య‌క్ర‌మ‌లో అప్ప‌టి ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర‌రెడ్డితో క‌ల‌సి చిరంజీవి క‌ల‌సి పాల్గొన్నారు

 

  • యువ‌త‌లో ట్రాఫిక్‌పై అవ‌గాహ‌న కల్పించే కార్య‌క్ర‌మంలో సైతం చిరంజీవి పాలు పంచుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ట్రాఫిక్‌పై నిర్వ‌హించిన అవేర్‌నెస్ క్యాంప్‌లో పాల్గొని క‌మేండోల గౌర‌వ వంద‌నాన్ని స్వీక‌రించారు. నేటి బాల‌లే రేప‌టి పౌరుల‌ని చెప్పిన చిరంజీవి... యువ‌త‌ను స‌రైన మార్గంలో న‌డిపించ‌డంలో త‌ల్లిదండ్రుల‌ది కీల‌క పాత్ర అని చెప్పారు. 

 

  • ప్ర‌జ‌లనే కాదు పోలీసుల‌ను సైతం చిరంజీవి ప్ర‌భావితం చేయ‌గ‌లిగారు. చిరంజీవి స్పూర్తితో ఏపీ పోలీస్‌, గ్రేహౌండ్స్ ద‌ళాలు ర‌క్త‌దాన శిభిరాన్ని నిర్వహించాయి
     

  • సేవా కార్య‌క్ర‌మాలే కాదు సాంస్కృతి కార్య‌క్ర‌మాల‌లో సైతం చిరంజీవి పాలుపంచుకుంటారు. క‌డ‌ప జిల్లా వార‌స‌త్వ‌, సాంస్కృతిక గొప్ప‌దనాన్ని తెలియ‌జేసేలా నిర్వ‌హించిన క‌డ‌పోత్స‌వంలో చిరంజీవి పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో చిరంజీవి పాల్గొన‌డం ద్వారా ఈ వేడుక మ‌రింత ఎక్క‌వ‌గా ప్ర‌జ‌ల్లోకి వెళ్ళేందుకు తోడ్పాటునందించారు. 
     

  • సేవ‌తో పాటు బాధ్య‌త‌గ‌ల పౌరుడిగా చిరంజీవి ఆద‌ర్శంగా నిలుస్తారు. 1999-2000 సంవ‌త్స‌రానికి అత్య‌ధిక ఆదాయ‌పు ప‌న్ను చెల్లంచిన వ్య‌క్తిగా నిలిచారు. చిరంజీవి నిజాయితీని గుర్తించిన కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాలు 'సమ్మన్ అవార్డ్'తో చిరంజీవిని సత్కరించాయి. 
     

  • 1988లో, ఆంధ్ర ప్రదేశ్‌లో పత్తి రైతులు ఆత్మహత్యలు చిరంజీవిని క‌దిలించాయి. ఈ స‌మ‌యంలో మృతుల కుటుంబాల‌కు అండ‌గా నిల‌బ‌డ్డారు. ఆ క‌టుంబాల‌కు ఆర్ధిక సాయం చేసి ఆదుకున్నారు. 
     

  • తెలుగు రాష్ట్రాల‌తోపాటు దేశంలో ప్ర‌జ‌ల‌కు ఎప్పుడు ఏ క‌ష్టం వ‌చ్చినా స్పందించ‌డంలో చిరంజీవి ముందుంటారు. త‌నకున్న కోట్లాది మంది అభిమానులు ఇలాంటి స‌మ‌యంలో ఆయ‌న‌కు తోడుగా ఉంటారు. గుజార‌త్‌లో భూకంపం వ‌చ్చిన‌ప్పుడు ఇదే విష‌యాన్ని రుజువు చేశారు. మొట్టమొదటి బాధిత ప్రాంతానికి వెళ్ళింది చిరంజీవి అభిమానులు. అభిమానుల‌ను ప్రేరేపించ‌డ‌మే కాకుండా చిరంజీవి కూడా వ్య‌క్తి గ‌తంగా బాధితుల‌కు భారీ విరాళం ప్ర‌క‌టించారు. 
     

  • అంధుల స‌మ‌స్య‌లు తెలిసిన వ్య‌క్తిగా ఓ జాతీయ స‌మావేశంలో క‌ళ్ళులేని చిన్నారులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్లు వివ‌రించారు. త‌న ప్ర‌సంగం ద్వారా అప్ప‌టి గ‌వ‌ర్న‌ర్ స‌ర్జిత్‌సింగ్ బ‌ర్నాలాను సైతం ఆక‌ట్టుకున్నారు. 
     

  • క‌ర్నాట‌క గ‌వ‌ర్న‌ర్ ర‌మాదేవితో క‌ల‌సి ఆంధ్ర‌ప్ర‌దేశ్ సంస్కృతి, వార‌స‌త్వానికి ప్ర‌తినిధిగా ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 
     

  • దేశంలో ఎలాంటి విప‌త్తు సంభ‌వించినా ప్ర‌ధాన‌మంత్రి, ముఖ్య‌మంత్రి  సంహాయ‌నిధికి విరాళాలు అందించ‌డంలో చిరంజీవి ముందుంటారు. 
     

  • సినీ రంగంలో త‌న‌ను ఆద‌రించిన తెలుగు ప్ర‌జ‌ల‌కు మ‌రింత సేవ చేసేందుకు, రాజ‌కీయాల‌లో మార్పు తీసుకురావాల‌నే సంక‌ల్పంతో 2008 ఆగ‌స్టు 26న చిరంజీవి త‌రుప‌తిలో ప్ర‌జారాజ్యం పార్టీని ప్రారంభించారు. 
     

  • పార్టీ స్థాపించిన 9 నెల‌ల స‌మ‌యంలోనే సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో 70 లక్ష‌ల ఓట్ల‌తోపాటు 18 ఎమ్మెల్యే సీట్ల‌ను సైతం కైవ‌సం చేసుకున్నారు. 
     

  • చిరంజీవి రాజ‌కీయాల్లోనూ విలువ‌లు, సాంప్ర‌దాయాలు పాటించారు.  రాజ‌క‌యీ నాయ‌కుడిగా, ప్ర‌తిప‌క్ష నాయకుడిగా నిర్మాణాత్మ‌క ప్ర‌తిప‌క్ష పాత్ర‌ను అప్ప‌టి ప్ర‌జారాజ్యం పార్టీ పోషించింది. 
     

  • నటుడిగా, పరోపకారిగా, ప్రజా నాయకుడిగా డా. చిరంజీవి అన్ని రంగాల్లోనూ రాణించారు. ఇప్పటికీ రాణిస్తూనే ఉన్నారు. చిరంజీవి తన కార్యక్రమాల ద్వారా కోట్లాది హృదయాలలో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు.
     

  • తాను స్థాపించిన ప్ర‌జారాజ్యం పార్టీ 2011 ఫిబ్ర‌వ‌రిలో చిరంజీవి బేష‌ర‌తుగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డం ద్వారా త‌న సామాజిక‌ సేవా కార్య‌క్ర‌మాల‌ను దేశం మొత్తం విస్త‌రించ‌డానికి ఉప‌యోగించుకున్నారు.
     

  • ఏప్రిల్ 2012లో, డాక్టర్ చిరంజీవి పార్లమెంట్ (రాజ్యసభ) సభ్యుడిగా నామినేట్ అయ్యారు
     

  • 2012 అక్టోబర్ 28న, డాక్టర్ చిరంజీవిని స్వతంత్ర హోదాలో పర్యాటక శాఖ సహాయ మంత్రిగా కేంద్ర కేబినెట్లో బాధ్యతలు చేపట్టారు.
     

  • ఆరు సంవ‌త్స‌రాలు రాజ్య‌స‌భ స‌భ్యుడుగా బాధ్య‌త‌లు నిర్వ‌హించిన చిరంజీవి 2018 ఫిబ్ర‌వ‌రిలో ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. ఆ త‌రువాత మ‌ళ్ళీ సినీ రంగంవైపు అడుగులు వేశారు.
     

  • రాజ‌కీయాల‌నుంచి సినిమాల్లోకి వ‌చ్చిన త‌రువాత చిరంజీవి న‌టించిన మొద‌టి సినిమా ఖైదీ నంబ‌ర్ 150 ఈ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర రికార్దులు సృష్టించింది. ఈ విజ‌యం చిరంజీవి రీ ఎంట్రీపై ఉన్న సందేహాల‌ను ప‌టాపంచ‌లు చేసింది. చిరంజీవికి అభిమానుల్లో ఆద‌ర‌ణ చెక్కు చెద‌ర‌లేద‌ని నిరూపించింది.
     

  • రెండో సినిమా సైరా నరసింహారెడ్డిలో నటించారు. రాయలసీమకు చెందిన తొలి స్వాతంత్ర ఉధ్యమకారుడి పాత్రను చిరంజీవి పోషించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రనుంచి స్పూర్తితో ఈ చిత్నాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా ఉయ్యాల వాడ నరసింహారెడ్డి గురించి నేటి తరానికి తెలిసిందని చెప్పాలి.

  • చిరంజీవి ప్రస్తుతం ఆచార్య, లూసీఫర్‌ సినిమా రీమేక్‌లో నటిస్తున్నారు. ఇవి చిరంజీవి 152, 153 సినిమాలు.

bottom of page